15th-LokNayak-Foundation-Award-Jan-2019

15th-LokNayak-Foundation-Award-19-Jan-2019

Microsoft Word – 15th Loknayak Foundation Award Invitation & Photos


http://www.andhrajyothy.com/artical?SID=697392

AndhraJyothy Logo

అపూర్వ రచయిత ‘అంపశయ్య’ నవీన్
18-01-2019 04:33:34

రచయిత అయినవాడు ఏ ఒక్క విధానానికో, రాజకీయ పార్టీకో చెందినవాడు కాకూడదు. అలా అయితే అతడు తన స్వేచ్ఛా -స్వాతంత్ర్యాలని కోల్పోతాడని, రచయితకు తాను అనుభూతి పొందింది రాసే స్వాతంత్ర్యం తప్పనిసరిగా వుండాలని నవీన్ భావిస్తారు. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ తనను బాగా ప్రభావితం చేశారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. 

ఒక నవల పేరే ఇంటిపేరుగా మారిన రచయిత ఎవరైనా ఉన్నారా? ఆంగ్లసాహిత్యంలో యులిసెస్ తర్వాత చైతన్య స్రవంతి శిల్పాన్ని, అంటే మన ఆలోచనా ప్రవాహాన్నే ఉన్నదున్నట్లుగా అక్షరరూపంలో పెట్టిన నవలాకారుడు ఎవరైనా ఉన్నారా? వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో వెలువడిన వేలాది గ్రంథాల్లో ఎంపిక చేసిన వంద గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నవలను రాసింది ఎవరు? ప్రపంచంలో జరిగిన పలు విప్లవోద్యమాలతో పాటు భారత దేశంలో జరిగిన విప్లవోద్యమాలు, తెలంగాణసాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, స్త్రీపురుష సంబంధాలు, ఎమర్జెన్సీ దారుణాలు, సంస్కరణలు ధ్వంసం చేసిన మానవ సంబంధాలు ఇలాంటి విస్తృత అంశాలపై పుంఖానుపుంఖాలుగా నవలలు, కథలు రచించిన ఏకైక తెలుగు రచయిత ఎవరు? వీటన్నిటికీ ఒకే సమాధానం వస్తుంది. ఆయన ఎవరో కాదు. అంపశయ్య నవీన్. ‘అంపశయ్య’ ఆయన ఇంటిపేరు కాదు ఆయన రాసిన నవల పేరు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల తాలూకాలో మధ్యతరగతి వ్యవసాయదారులు దొంగరినారాయణ, పిచ్చమ్మ దంపతులకు 1941లో జన్మించిన దొంగరి మల్లయ్యే తర్వాతి కాలంలో తెలుగులో ప్రసిద్ద నవలాకారుడు అవుతారని, తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకుంటారని, ఎన్నో కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారని, ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన అధ్యాపకుడని ఎవరు ఊహించారు? కవిమిత్రుడైన వరవరరావు సలహాతో నవీన్ గా పేరు మార్చుకున్న ఈ దొంగరి మల్లయ్య అదే పేరుతో అనేక కథలు రాశారు. బాల్యంలో ఆంధ్రమహాసభనుంచి తెలంగాణ పోరాటం, సంస్కరణల వరకు ఆయనను ప్రభావితం చేయని చారిత్రాత్మక ఘట్టాలు లేవు. బాల్యం నుంచే ఆయనకు రచన శ్వాసగా, ధ్యాసగా మారింది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇరివెంటి కృష్ణమూర్తి, జి.వి. సుబ్రహ్మణ్యం లాంటి వారి ప్రభావం, వరవరరావు, సి. రాఘవాచారి, శివకుమార్ లాంటి అభ్యుదయ, విప్లవ సాహితీకారులతో సాన్నిహిత్యం, కాళోజీ నారాయణరావు అగ్రజుడు కాళోజీ రామేశ్వరరావు స్థాపించిన మిత్రమండలితో పనిచేసి రైటర్స్ వర్క్షాప్‌లో పాఠాలు నేర్చుకోవడం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జీవితం, మార్క్స్, ఫ్రాయిడ్, డార్విన్, సార్త్రే, రస్సెల్, బెర్నార్డ్ షా వంటి ఉద్డండుల రచనలను యువకుడుగా ఉన్నప్పుడే చదవడం, ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా సమాజాన్ని అద్యయనం చేయడం ఆయనను ప్రభావితం చేశాయి. ప్రతి అంశాన్ని ఆర్థిక, సామాజిక, మానసిక కోణంలో చూసే నవీన్ 32 పైగా నవలు, 6 కథా సంకలనాలు, 5 సాహిత్య వ్యాసాల సంకలనాలు వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు దేశ విదేశాల్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నవీన్ రాసిన అనేక నవలల్లోను, కథల్లోనూ, వామపక్ష భావాలు, స్త్రీ వాద దృక్పథం, సెక్యులరిస్ట్ విధానాలు, శాస్త్రీయ దృక్పథం, కుల, మత, ప్రాంతాలకు అతీతమైన మానవత్వ భావాలు, తీవ్రవాద- హింసాత్మక విధానాలకు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తాయి. ఇవే ఆయనను రచయితగా నిలబెట్టాయి. నవీన్ రచించిన తొలి నవల అంపశయ్య. ఈ రచనతోనే నగర జీవితాన్ని చైతన్య స్రవంతి శిల్పం ద్వారా చెప్పిన తొలి తెలుగు నవలా రచయితగా ఆయన నిలిచిపోయారు. అంపశయ్య ఒక మనో వైజ్ఞానిక నవల కూడా. కాల్పనిక నవలా రచనలో ఒక ముఖ్య ప్రయోగం చేసిన తొలి రచయిత కూడా ఆయనే. మనిషిలో భావాలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఒక దాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. వాటిని అక్షరరూపంలో పెట్టడం అంత సులభం కాదు. ఆలోచన నిరంతరంగా సాగే ప్రవాహం. ఇంగ్లీష్ లో జేమ్స్ జాయిస్ రచించిన ‘యులిసిస్’ చైతన్య స్రవంతి శిల్పంతో రాసిన మొదటి నవల. గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, రావిశాస్త్రి ‘అల్పజీవి’, చండీదాస్ ‘హిమజ్వాల’, వినుకొండ రామదాసు ‘ఊబిలో దున్న’ నవలలలో ఈ చైతన్య స్రవంతి శిల్పాన్ని సందర్భోచితంగా ఉపయోగిస్తే పూర్తిగా అదే శిల్పంతో, అనితర సాధ్యమైన శైలితోసాగిన బృహత్తర నవల ‘అంపశయ్య’. అందుకే ఈనవల పేరే రచయితకు ఇంటిపేరుగా మారిపోయింది. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో వచ్చిన వంద గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. శిల్పం రీత్యా మాత్రమే కాదు, దేశ, విదేశాల్లో జరుగుతున్న సామాజిక పోరాటాలను, ఉద్యమాలను కూడా ఆయన మనకు ఈ నవల ద్వారా పరిచయం చేస్తారు. అందుకే వేలవేల మంది పాఠకులు ఈ నవలను ఇప్పటికీ చదివి ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు. అంపశయ్యకు కొనసాగింపుగా ఆయన రాసిన ముళ్ల పొదలు, అంతస్రవంతి కూడా గొప్ప రచనలే. అందుకే వీటిని నవలాత్రయంగా విమర్శకులు గుర్తించారు. 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కాలరేఖలు తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా వచ్చిన గొప్ప నవల. బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను, 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్‌పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్యంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను రాయాలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’, ‘బాంధవ్యాలు’ అనే నవలాత్రయంగా విడుదల చేశారు. ఈ మూడు నవలలు ఇటు తెలంగాణ ప్రాంతంలోను, అటు భారతదేశంలోను, 50 సంవత్సరాలలో, (1944–1994) జరిగిన అనేక సంఘటనల్ని ఈ కాలంలో ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, జీవనాల్లో ఉత్పన్నమైన పరిణామాల్ని చిత్రిస్తాయి. 1996లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీ విరమణ చేశాక నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టారు. 50 ఏళ్లలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన మూడో నవల ‘కాలరేఖలు.’ నక్సలైట్లకూ, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో బలవుతున్న అమాయకుల సమస్యను తన రక్తకాసారం నవలలో ధైర్యంగా చిత్రించిన తొలి నవలాకారుడు కూడా నవీనే. ఆయన నవల ‘విచలిత’ స్త్రీకో నీతినీ, పురుషుడికో నీతినీ అమలు పరిచే పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది. స్వచ్చమైన ప్రేమ అంటే ఆయన తన ‘సౌజన్య’ నవలో చెప్పారు. స్వేచ్ఛగా జీవించే వారిని సమాజం సంప్రదాయాల పేరుతో ఎలా బంధిస్తుందో చెప్పేందుకు ఆయన ‘సంకెళ్లు’ అనే నవలు రాశారు. పైకి పోట్లాడుకుంటున్నా, యువతీయువకుల మధ్య ఏర్పడే బలీయమైన బంధాన్ని ఆయన నవల ‘కరుణ’ చిత్రిస్తుంది. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలిని ఆ పాఠశాల యాజమాన్యం ఎలా వేధిస్తుందో చెప్పేందుకు ‘ప్రత్యూష’ అనే నవల రాశారు.నవలాకారుడికీ, సాహిత్యాభిమాని అయిన యువతికీ మధ్య ఏర్పడే స్వచ్ఛమైన స్నేహబంధాన్ని వివరించే నవల ‘తీరని దాహం’. భార్యాభర్తల మధ్య కలిసి జీవించడం నరకప్రాయమైనప్పుడు విడిపోవడమే శ్రేయస్కరమని వివరించే నవల ‘చీకటి మూసిన ఏకాంతంలో’. ఉద్యోగాల్ని చేస్తున్న స్త్రీల సమస్యల్ని చిత్రించే నవల ‘విమెన్స్ కాలేజీ’. జరిగిన ఒక సంఘటనను ఎవరెవరు వాళ్ల దృక్కోణాల్లో వేర్వేరుగా చూస్తారో, నిజంగా జరిగిందేమిటో చెప్పే ఎనిమిది వర్షన్స్ను అద్భుతంగా చిత్రించిన నవల ‘దృక్కోణాలు’. ప్రపంచీకరణ నేపథ్యంగా ఉత్పన్నమైన సమస్యల చిత్రణ ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’? తన కిష్టమైన ప్రఖ్యాత రచయిత చలం జీవితాత్మక నవల ‘ప్రేమకి ఆవలితీరం’. పాతికేళ్లలో తెలంగాణ ప్రాంతంలోనూ, భారత దేశంలోనూ తలెత్తిన అనేక ఉద్యమాల్ని, రాజకీయ పరిణామాల్ని నేపథ్యంగా తీసుకుని కుటుంబంలో మూడు తరాల్ని చిత్రించిన నవల ‘బాంధవ్యాలు’. ఈ నవల టెలీసీరియల్‌గా వెలువడింది. నవీన్ రాసిన ఏ నవల, కథ చదివినా అవన్నీ మన జీవితానికి దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తాయి. రచయిత అయినవాడు ఏ ఒక్క విధానానికో, రాజకీయ పార్టీకోచెందినవాడు కాకూడదు. అలా అయితే అతడు తన స్వేచ్ఛా -స్వాతంత్ర్యాలని కోల్పోతాడని, రచయితకు తాను అనుభూతి పొందింది రాసే స్వాతంత్ర్యం తప్పనిసరిగా వుండాలని నవీన్ భావిస్తారు. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ తనను బాగా ప్రభావితం చేశారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. రచయితలు ఏమి రాసినా వారి హృదయాల్లో కలం ముంచి రాయాలని చలం చెప్పిన మాటలు ఆయనను ప్రభావితం చేశాయి. ఏ రచయితకైనా క్రమశిక్షణ, ఆదర్శవంతమయిన నడవడిచాలా ముఖ్యమైనవని ఆయన భావిస్తారు. ఇవి లేని ఎందరో గొప్ప కళాకారులు చాలా త్వరగానే వాళ్ళ కళ నుండి కనుమరుగై పోయిన ఉదంతాలు ప్రపంచ చరిత్రలో ఎన్నో వున్నాయని ఆయన గుర్తు చేశారు. ఒక రచయితకు మరో రచయితను గుర్తించడం అనేది చాలా అరుదైన విషయం. కాని నవీన్ తోటి నవలాకారుల్ని గుర్తించి ఒక పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ఒక నవలాకారుడు రచించిన మొదటి నవలకు 10,000 -రూపాయలు పురస్కారాన్ని ఇచ్చి, కొత్తగా నవలలు రాస్తున్న నవలాకారులని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2012వ సంవత్సరం నుండి ఆయన ‘నవీన్ సాహిత్య సమితి’ ద్వారా ఈ పురస్కారాన్ని అందజేయడం గొప్ప విషయం.తాను రాసిన మొదటి నవల ‘అంపశయ్య’ను ప్రచురించుకోవటానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో మరిచిపోకుండా, అలాంటి కష్టాలు ఒక ప్రతిభావంతుడైన నవలాకారుడు పడకూడదనే ఉద్దేశ్యంతోనేఈ పురస్కారాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం. నవీన్ అనుసరించిన దారిలోనే నడుస్తున్న లోక్ నాయక్ ఫౌండేషన్ ప్రతిఏటా ఆయన లాంటి గొప్ప రచయితలను సన్మానించాలని నిర్ణయించింది. జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని తలపించే విధంగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. జస్టిస్ చలమేశ్వరరావు, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బాబ్డేల చేతుల మీదుగా నేడు ఆయనను సైకతస్థలి అయిన విశాఖలో సత్కరించుకోవడం ఒక మహత్తర ఘట్టం.

 ఆచార్యయార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(రేపు అంపశయ్య నవీన్‌కు విశాఖపట్నంలోలోక్‌నాయక్‌ పురస్కార ప్రదానం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *