తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ

భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయిదారు ఉండగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండటంలో తప్పు లేదని, అందరూ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాలు విస్తరించాయే తప్ప విడిపోలేదని మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం డెట్రాయిట్‌లో అమెరికా తెలంగాణా సంఘం(ఆటా) సంస్థ విందు కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరింటికి మరొకరు వెళ్లి వారి వారి వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా ఆశావహ దృక్పథంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తనకు బంగారు తెలంగాణ వద్దని అంతకు మిన్నగా దాశరథి ఆశించినట్లు కోటి రతనాల వీణగా భాసిల్లే తెలంగాణా కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వచనా కవిత్వ ప్రముఖుడు కాళోజీ నారాయణరావు కవితలు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె రచించిన “వచ్చిండన్నా…వచ్చాడన్నా..” వంటివాటిని ఆయన ఉదహరించారు. తెలుగువారికి ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని వారికి వెన్నుదన్నుగా ఇరు తెలుగు రాష్త్రాల వారు నిలబడాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో నందమూరి తారకరామారావు, పీవీ.నరసింహారావులకు భారతరత్న వచ్చేందుకు ఇరు ప్రభుత్వాలతో పాటు ప్రవాసులు అందరూ కృషి సలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థాపించిన 72రోజుల్లోనే అమెరికా తెలంగాణా సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ప్రథమ తెలంగాణా సభలు ఇంత ఘనంగా జరగడం చాలా హర్షించదగిన విషయమని ఆయన అన్నారు. ఆటా కార్యవర్గ బృంద సభ్యులు కొండా రామ్మోహన్, వినోద్ కుకునూర్, నాగేందర్ అయితా, మాధవరం కరుణాకర్ తదితరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

కొసమెరుపు: ఆటా సభలకు హాజరయిన అతిథులందరూ కేసీఆర్ భజన చేసినవారే తప్ప ఇతర పార్శ్వాలను స్పృశించిన వారే కనపడలేదు. వీరిలో యార్లగడ్డ ఒక్కరే మినహాయింపుగా దాశరథి, కాళోజీ, సినారెలను ప్రస్తుతించడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ Detroit 08-July-2016-Leader E Paper తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ Detroit 08-July-2016_Page_1 తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ Detroit 08-July-2016_Page_2

One thought on “తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *